ఇంకొక దినోత్సవం

yoga-poses-cover-1

సాధారణమగా మన సంస్కృతీ పరిరక్షకులకు… దినోత్సవాలంటే ఒళ్ళుమంట, “ఇది వ్యాపార సంస్కృతిలో భాగం” అన్న విమర్శ ఉండనే ఉంది. మాతృదినోత్సవం, పితృదినోత్సవం, ప్రేమికుల దినోత్సవం ఎన్ని చూడ్లేదు?! ఆశ్చర్యకరంగా యోగాదినోత్సవాలనిమాత్రం వ్యాపార సంస్కృతిలోభాగంగా చూడ్డానికి ఎవ్వరూ సిధ్ధంగాలేరు. ఎన్నో హామీలు చేసి ఏదో ఉధ్ధరించేస్తామని ఊదరగొట్టినవారు ఇప్పుడిలా… అసలు సమస్యలనుంచి ప్రజల దృష్టిమరల్చడానికి గ్లాడియేటర్లతో యుధ్ధాలు చేయించిన పాత రోమన్ ప్రభువుల్లా ప్రవర్తించడమూ, దేశమంటే భావావేశమూ, చిత్రపటాలు, మట్టేతప్ప ప్రజలు, వారి సుఖసంతోషాలు  కావని గాఢంగా విశ్వసించే ఒక మూక దీనికి పూనకాలు తెచ్చుకొని యోగాదినోత్సవాన్ని పురస్కరించుకొని ఓవరాక్షన్ చెయ్యడమూతప్ప ఈ దినోత్సవం వల్ల జనాలకు ఒరిగేదేమిటి? ఇంతలావున చొక్కాలు చించుకుంటున్న వారిలో యోగాని ఒక జీవనవిధానంగా మలచుకొని జీవిస్తున్నదెవరు? అసలు మోదీ గారు యోగాచేస్తారా అని పుతిన్ అడిగారట. అదే ప్రశ్న హడావిడి చేస్తున్నవారందరినీ అడగాలని నేనంటాను. యోగా అనేది ఎప్పుడో కమర్షియలైజ్ అయిపోయిన ఒక స్కిల్. దాన్ని ప్రమోట్ చెయ్యడానికి ప్రైవేటు సంస్థలెన్నో ఉండగా పన్నుచెల్లింపుదరుల సొమ్మును పైవేటు కంపెనీల తరఫున తగలెయ్యడం అదికూడా ప్రభుత్వమే ఆపనిచెయ్యడం ఎందుకో అర్ధం కావడంలేదు.

మన దేశభక్త advertising agencies యోగా ఏవిధంగా సార్వజనీనమో వివరించేపనిలో తలమునకలైపోయాయి (యోగా ఇండియాలోనే పుట్టిందన్న విషయాన్ని వీళ్ళు వీళ్ళ ప్రచారం సందర్భంగా మర్చిపోలేదులెండి). సమస్యల్లా యోగాని ప్రోత్సహించడంకాక దాన్ని బలవంతంగా రుద్దడం మాత్రమే. వీళ్ళెవరో తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చెయ్యమని ఒక ఫత్వా విధించారట, వాళ్ళెవరో గింజుకుంటున్నారట.  అసలు వాళ్ళతో బలవంతంగా ఆ నమస్కారాలు చేయించడం ఎందుకు? ఎవరో రాజులు మధ్యయుగాల్లో బలవంతంగా వాళ్ళ దేవుణ్ణి పూజింపజేశారని కదా మనం ఇప్పటికీ గింజుకుంటున్నది.  మనమూ వాళ్ళలాగే ప్రవర్తించడం ఏమాత్రం న్యాయం? ఒకాయనంటాడూ… “సూర్యుణ్ణి పూజించనివాళ్ళంతా కృతఘ్నులు” అని. అదేకదా వాళ్ళూ అంటున్నది. అల్లాని పూజించించనివాళ్ళంతా కృతఘ్నులు అని.  ఎవరినమ్మకాలు వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకోవాలి.  నీ చేయి నాముక్కు తాకితే, నా చేయి నీ ముక్కు నొక్కకుంటుందా? అయినదానికీ కానిదానికీ ఇలా కృతజ్ఞత/కృతఘ్నత బ్లాక్‌మెయింలింగెందుకట? నిజమేంటంటే సైన్సు ప్రకారం సూర్యుడు (‘డు’ ని క్షమించండి) ఒక నక్షత్రం. దాన్ని మనం పూజించినా, పూజించకున్నా మన దైనందిన జీవితాల్లో కలిగే పెనుమార్పులేమీ ఉండబోవు. ఈనాటికి మన భారత దేశంలో అనారోగ్యాలు యోగా ఆచరించకపోవడంవల్ల కాదు మహాప్రభో పోషకాహారలేమివల్ల కలుగుతున్నాయి. యోగా మాదేనని ఎచ్చులుపోవడానికి పెట్టే డబ్బుఖర్చు పోషకారలోపంతో బాధపడే పిల్లలకు సరైన ఆహారం కల్పించడానికి పెట్టండి.